Thursday 5 September 2024

త్రివిక్రమమూర్తియైన | Trivikrama Murthiyaina Annamacharya Sankeerthana With Telugu Lyrics

త్రివిక్రమమూర్తియైన దేవునివలె నున్నాఁడు 
భువి సేవించేవారిపాలి పుణ్యఫల మీతఁడు 

అంచె ఉదయాస్త గిరులందు నొక జంగ చాఁచి 
వంచించక మిన్ను దాఁక వాలమెత్తి 
ముంచి బ్రహ్మలోకము మోవఁగ ప్రతాపమున 
పెంచినాఁడు తనమేను పెద్దహనుమంతుఁడు 

త్రివిక్రమమూర్తియైన దేవునివలె నున్నాఁడు 
భువి సేవించేవారిపాలి పుణ్యఫల మీతఁడు 

తిరముగ హస్తములు దిక్కులు నిండఁ బరపి 
వరుసఁ గర్ణము లిరువంకఁ జిక్కించి 
దుర దుర మస్తకము ధ్రువమండలము సోఁక 
పెరిగినాడు ఇదివో పెద్దహనుమంతుఁడు 

త్రివిక్రమమూర్తియైన దేవునివలె నున్నాఁడు 
భువి సేవించేవారిపాలి పుణ్యఫల మీతఁడు 

అక్కజపు రోమములు అన్ని లోకము లొరయ 
మొక్కుచు శ్రీవేంకటేశుమోహపు బంటై 
పక్కన నజాండ కప్పరము నిండాఁదాను 
పిక్కిటిల్లినాఁ డిదివో పెద్దహనుమంతుఁడు

 

No comments:

Post a Comment